‘ఇంటి అద్దె చెల్లించలేక.. కిడ్నీ అమ్మకానికి పెట్టాడు’ ఓ వ్యక్తి. అంతేకాకుండా ‘మై లెఫ్ట్ కిడ్నీ ఆన్ సేల్’ అనే వాల్ పోస్టర్ ను కూడా తయారు చేశాడు. కనిపించిన చోట్లలో ఈ వాల్ పోస్టర్ ను అతికిస్తున్నాడు. ఈ వినూత్న ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి తెర లేపింది.
డీటైల్స్ కి వెళ్తే..‘లెఫ్ట్ కిడ్నీ ఆన్ సేల్’ పేరుతో వాల్ పోస్టర్ ను రమ్యఖ్ అనే యూజర్ ట్వీట్ చేశాడు. ‘ఇంటి యజమాని అద్దెకు అడ్వాన్స్ అడుగుతున్నారు. అందుకు నాకు డబ్బు కావాలి. అందుకే నా ఎడమ కిడ్నీని అమ్మకానికి పెట్టాను’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కు కనీసం గంటకుడా గడవకుండానే 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఆ తర్వాత మళ్లీ మరో పోస్టు చేస్తూ.. ‘ఇది నిజంకాదు.. నేను జోక్ చేశాను.. బెంగళూరులో ఇందిరానగర్ లో అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాను.. నా ప్రొఫైల్ కోసం కోడ్ కోడ్ ను స్కాన్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు. నెటిజన్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఇది జోక్ అయినప్పటికీ బెంగళూరులో వాస్తవికతకు అద్దం పడుతోందని సమర్దిస్తున్నారు.
నగరంలో ఇళ్ల అద్దె చెల్లించడానికి మా జేబులు ఖాళీ అవుతున్నాయని కామెంట్ సెక్షన్ లో తమ కష్టాలు చెప్పుకొని కన్నీరుపెట్టుకుంటున్నారు కొందరు యువకులు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జాబ్ నిమిత్తం ఎందరో బెంగళూరు నగరానికి తరలివస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ పెరుగుతున్న అద్దెలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.