ఉత్తర కొరియా అసలు తగ్గేదేలే అంటుంది. ఆదివారం ఓ శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించింది. తాజగా దానికి సంబందించిన ఫోటోలను విడుదల చేసింది. అక్కడితో ఆగకుండా తాము ప్రయోగించిన క్షిపణికి అమెరికా భూబాగాన్ని ఢీకొట్టే సామర్థ్యం ఉందని కవ్వించింది. కిమ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ఆసక్తి రేపుతోంది.
ఉత్తరకొరియా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగుతోంది. అమెరికా టార్గెట్ గా వరుస క్షిపణులు ప్రయోగిస్తోంది. దేశంలోని ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే దాన్ని వదిలేసి ఆయుధ సంపత్తి పెంచుకుంటుంది. తాజాగా ఆదివారం కొత్తగా హాసాంగ్-12 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఏడాదిగా చేస్తున్న క్షిపణి పరీక్షల్లో ఇది చాలా శక్తివంతమైనది. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదల చేశారు.
సముద్ర మట్టానికి 2 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన ఫోటోలను అధికారికంగా బయటపెట్టారు. కొరియాతో పాటు చుట్టు పక్కన ఉన్న అన్ని ప్రాంతాలు స్పష్టంగా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాయి. అయితే.. ఉత్తర కొరియా ఇక్కడే ఓ వివాదాస్పద ప్రకటన చేసింది. తాజాగా ప్రయోగించిన మిస్సైల్ కి అమెరికాకు చెందిన గువామ్ ద్వీపాన్ని ఢీకొట్టే సామర్థ్యం ఉందని చేసింది. 4,500 కిలోమీటర్ల దూరం నుంచి కూడా లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. గువామ్ ద్వీపం 3400 కి.మీ దూరంలో ఉంది.
జపాన్ కూడా ఈ మిస్సైల్ ప్రయోగంపై స్పందించింది. సుమారు రెండు వేల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి అక్కడ నుంచి 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని అంచనా వేసింది. 30 నిమిషాల పాటు ప్రయాణించి.. చివరికి సముద్రంలో పడిపోయిందని జపాన్ కేబినెట్ ముఖ్య కార్యదర్శి హిరోకాజు మత్సునో తెలిపారు. అయితే.. ఉత్తర కొరియా చేస్తున్న ఈ కవ్వింపు చర్యలను అమెరికా విమర్శిస్తుంది.