ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఆయేతో కలిసి మరోసారి కనిపించారు. ఉత్తర కొరియా సైన్య వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన విందులో కూతురితో కలిసి కిమ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో కిమ్ తన రాజకీయ వారసురాలిగా కిమ్ జు ఆయేను ప్రకటించేందుకే రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఉత్తర కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ వివరాల ప్రకారం… కొరియన్ పీపుల్స్ ఆర్మీ జనరల్ ఆఫీసర్స్ లాడ్జింగ్ క్వార్టర్స్‌ను కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి ఈ రోజు సందర్శించారు. ఈ సందర్బంగా రక్షణ దళాలను ఉద్దేశించి కిమ్ ప్రసంగించారు.
విదేశాల నుంచి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ ప్రపంచంలో బలమైన సైన్యంగా నిలుస్తున్నందుకు సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం యాంగక్టో హోటల్‌లో విందు నిర్వహించారు. దీనికి కిమ్, ఆయన సతీమణి, ఆయన కుమార్తె కలిసి ఎర్ర తివాచీపై నడుస్తూ వచ్చారు.
దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రచురించింది. ఈ విందుకు సీనియర్ మిలిటరీ అధికారులు హాజరయ్యారు. గతంలో మూడు సార్లు కింగ్ జోంగ్ ఉన్ తో కలిసి కిమ్ జూ ఆయే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె గౌరవనీయమైన, ప్రియాతిప్రియమైన అధినేత కుమార్తె అంటూ ఆ దేశ మీడియా పేర్కొంది.
ఇటీవల ఆమె వరుసగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. రాబోయే కాలంలో దేశానికి ఆమె పరిపాలకురాలని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడే ఈ విధంగా ఊహించడం అపరిపక్వమవుతుందని అంటున్నారు. ఆమె ప్రవర్తన కృత్రిమంగా ఉందని చెబుతున్నారు.