దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంపై దక్షిణ కొరియా సైనికదాడికి దిగితే ప్రతిగా తాము అణుదాడులు చేస్తామని హెచ్చరించారు.
‘ ఒక వేళ మా దేశంపై దక్షిణ కొరియా సైనిక దాడికి ప్రయత్నిస్తే అనివార్య పరిస్థితుల్లో మా అణు ఆయుధాలు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తాయి’ అని ఆమె అన్నారు.
ఉత్తర కొరియాపై ప్రతిదాడులు చేస్తామంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి మాట్లాడటం చాలా పెద్ద తప్పుగా ఆమె అభివర్ణించారు. తాము దక్షిణ కొరియాపై ఒక్క బుల్లెట్ పేల్చలేదని, బాంబు దాడి చేయలేదన్నారు.
సైనిక బలంలో దక్షిణ కొరియా తమకు సరితూగుతుందని తాము ఎప్పుడూ భావించలేదని, అందుకే దాడులు చేయలేదన్నారు. తమను ఎవరూ రెచ్చ గొట్టనంత వరకు ఎవరిపైనా దాడులు చేయబోమన్నారు.
ఇటీవల వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా దడ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర కొరియాలో ఉన్న ఏ టార్గెట్ నైనా చేరుకునే ఆయుధాలు తమ వద్ద కూడా ఉన్నాయంటూ దక్షిణ కొరియా రక్షణ శాఖ చీఫ్ వూక్ వ్యాఖ్యానించారు.
ఉత్తర కొరియాకు ధీటైన సమాధానం ఇచ్చే ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా కిమ్ యో జోంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.