నెదర్లాండ్ రాయబారి వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత వైఖరిపై నెదర్లాండ్ రాయబారి వ్యాఖ్యలను ఇండియా తప్పుబట్టింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వాత రాయబారి తిరుమూర్తి మాట్లాడారు.
తాము ఏమి చేస్తున్నామో తమకు తెలుసని ఆయన అన్నారు. ఈ విషయంలో తమకు ఇతరుల సలహాలు అవసరం లేదన్నారు. ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా దాడులకు దిగడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలి, సాధారణ సభలో పలు దేశాలు తీర్మానాలను ప్రవేశపెట్టాయి.
కానీ ఈ తీర్మానాలపై నిర్వహించిన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరిని పాటించింది. దీనిపై యూకేకు నెదర్లాండ్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోమ్ విమర్శలు చేశారు.
ఐక్యరాజ్యసమితి విధివిధానాలను భారత్ గౌరవించాలని, సాధారణ సభలో ఓటింగ్ కు దూరంగా ఉండటం సరికాదని ఓస్టెరోమ్ అన్నారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై భద్రతా మండలిలో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఓస్టెరోమ్ వ్యాఖ్యలను ఈ సమావేశంలో తిరుమూర్తి ప్రస్తావనకు తెచ్చారు. ఈ విషయంలో భారత్ కు ఎవరి సలహాలు అవసరం లేదన్నారు. తాము ఏమి చేస్తున్నామో తమకు పూర్తి అవగాహన ఉందన్నారు.
ఐక్యరాజ్య సమితి విధానాలు, అంతర్జాతీయ చట్టాలను భారత్ పాటిస్తుందన్నారు. అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను కూడా భారత్ గౌరవిస్తుందన్నారు.
ఉక్రెయిన్ రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఐరాస సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానానికి అనుకూలంగా 141 దేశాలు ఓటేశాయి. అయితే భారత్ లాంటి మరి కొన్ని దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.