లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారని.. ఇది ఇండియాలోనూ, విదేశాల్లోనూ దేశ వ్యతిరేక శక్తులు మాట్లాడే భాష మాదిరే ఉందని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాలు, భద్రత విషయానికి వస్తే దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన.. రాహుల్ మాట్లాడే మాటలు ఆయన సొంత పార్టీకే హాని చేస్తాయి తప్ప.. బీజేపీకి ఎలాంటి హానీ చేయవన్నారు.
‘రాహుల్ వల్లే కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది.. దాంతో మాకు సంబంధం లేదు.. కానీ దేశానికి హాని చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం మేం సహించే ప్రసక్తి లేదు’ అని హెచ్చరించారు. రాహుల్ క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యల గురించి రిజిజు ప్రస్తావిస్తూ.. ఇది సీరియస్ విషయం కాదని ఆ పార్టీ భావిస్తే.. పార్లమెంటులో ఓ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అర్హత ఆ పార్టీకి లేదని భావించవలసి వస్తుందన్నారు.
ఈ దేశానికి సేవ చేసేందుకు వారికి అవకాశం ఇచ్చిన ప్రజలకు సదా వారు రుణపడిఉండవలసిందే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ దేశ ప్రతిష్ఠ దెబ్బ తినేలా మాట్లాడారన్న కాంగ్రెస్ ఆరోపణను ఆయన ఖండిస్తూ.. మోడీ అలా మాట్లాడలేదని, ఒకప్పటి ప్రభుత్వం అవినీతితో కూడినదని, అసమర్థంగా వ్యవహరించిందని మాత్రమే వ్యాఖ్యానించారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
రాహుల్ విదేశాల్లో అన్నీ అబద్ధాలే మాట్లాడారని, పార్లమెంటులోనే కాకుండా అక్కడా దేశ వ్యతిరేక శక్తుల మాదిరి బొబ్బలు పెట్టారని రిజిజు ఆగ్రహంగా పేర్కొన్నారు. ఇండియాలో రాహుల్ భారత్ జోడో యాత్రను విదేశాల్లోని విద్యార్థులు కూడా చూశారు. అలాంటిది ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని వారెలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు.