న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్రానికి, సుప్రీం కోర్టు కొలీజియానికి మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని ఆయన లేఖలో సూచించారు.
చట్టసభల పరిధిలోకి న్యాయస్థానాలు తరుచూ చొరబడుతున్నాయని ఇటీవల లోక్ సభ స్పీకర్ సహా పలువురు నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని కేంద్ర మంత్రి ఇటీవల బహిరంగ ప్రకటన చేశారు.
రాజ్యాంగ న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ అపారదర్శకంగా ఉందనే భావనను తొలగించేందుకు సుప్రీం కోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను, హైకోర్టు కొలీజియంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులను చేర్చాలని మంత్రి ప్రతిపాదించారు.
మరోవైపు కొలీజియం సిఫార్సులు చేసినప్పటికీ న్యాయమూర్తుల నియామకంలో జాప్యం చేసినందుకు కేంద్రంపై ధిక్కార చర్యలు తీసుకోవాలని బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.దీనిపై తుది వాదనలు కూడా ముగిశాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.