స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించిన విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాన్ని ప్రజల విజ్ఞతకే వదిలేయాలని ఆయన అన్నారు. పార్లమెంటు అనేది ప్రజల ఆలోచనలు, దార్శనికతలు, ఎంపికల ప్రతిబింబమన్నారు.
వివాహ వ్యవస్థ, పౌర అంశాలను నియంత్రించే అంశంపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదించిన ఏదైనా చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించకపోతే, దానిని మార్చడానికి, ప్రతికూల తీర్పును ఇవ్వడానికి లేదా దాన్ని తిరిగి పార్లమెంటుకు రిఫర్ చేసేందుకు సుప్రీంకోర్టుకు అధికారం ఉందన్నారు.
రాజ్యాంగంలోని 142వ అధికరణాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో చట్టంగా మారేలా తీర్పును సుప్రీం కోర్టు జారీ చేయగలదని ఆయన వెల్లడించారు. అయితే, పాలసీ విషయానికి వస్తే, భవిష్యత్తును ఎలా పరిపాలించాలో భారత ప్రజలు నిర్ణయిస్తారని ఆయన వివరించారు.
ఆర్టికల్ 142 అనేది దీనిపై తీర్పు ఇవ్వాలా లేదా ఆదేశాలు జారీ చేయాల అనే అంశంపై విచక్షణాధికారాన్ని సుప్రీం కోర్టుకు ఇస్తుందన్నారు. ఇది భారత్ అంతటా వర్తిస్తుందన్నారు. దీన్ని ఈ విషయంలో ఒక నిబంధనను రూపొందించే వరకు పార్లమెంటు ఆమోదించిన చట్టానికి అనుగుణంగా చూడాలన్నారు.