హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎల్లయ్య అనే రైతు యూరియా కోసం లైనులో నిలబడి అక్కడనే మృతి చెందిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కిసాన్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చనిపోయిన ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ ఎం అన్వేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో రైతులంతా యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన దుస్థితి ప్రభుత్వం వల్లే దాపురించిందని వారన్నారు. సకాలంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలు తండ్లాట పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి చివరికి రైతులు బలికావాల్సివస్తోందని అన్నారు. అవసరాలకు సరిపడా స్థాయిలో రాష్ట్రానికి చేరాల్సిన యూరియా సెప్టెంబర్ మాసం వచ్చినా ఇంకా ఎందుకు చేరలేదో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వివరణ ఇవ్వాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్పారు.
‘నిజానికి తెలంగాణకు 8 లక్షల టన్నులు అవసరం అని తెలిసినా.. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి. చివరకు తప్పు మీదంటే మీదని కేంద్ర- రాష్ట్రాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతులను రోడ్ల మీదకు తీసుకువచ్చారు’ అంటూ కిసాన్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. దుబ్బాక దారుణం తరువాతనైనా ప్రభుత్వాలు మేల్కొని తక్షణమే రైతులందరికీ యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండు చేశారు.