
హైదరాబాద్ : యాదాద్రి ఆలయంలో జరిగిన తప్పిదానికి ప్రజలకు ఎలా సమాధానమివ్వాలో తెలియక ప్రభుత్వం ముప్పతిప్పలు పడుతున్నట్టు కనిపిస్తోంది. యాదాద్రి గుడిలో టీఆర్ఎస్ నేత కేసీఆర్ బొమ్మతో సహా ఆ పార్టీ గుర్తులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇతర అనేక చిహ్నాలను చెక్కించడం దుమారం రేపుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా సమర్ధించుకోవాలో తెలియక సర్కార్ వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావుతో ఒక స్టేట్‌మెంట్ ఇప్పించింది. ఫలానా బొమ్మలను చెక్కమని శిల్పులకు ఎవ్వరూ చెప్పలేదని, సీఎం కేసీఆర్ కోసం చెక్కించామని చెప్పడం సరికాదని కిషన్‌రావు చెప్పుకొచ్చారు. అంతగా బాధపడేంత ఘోరం ఏమీ జరగలేదని, చెక్కిన బొమ్మలు అలానే వుంటాయని ఇంత రాద్ధాంతం తరువాత కూడా అధికారులు అడ్డంగా మాట్టాడ్డం చూస్తే, వినేవాళ్ళకి ఎలా స్పందించాలో తెలియడం లేదు. అహోబిలం శిలలపై గాంధీ, నెహ్రూ బొమ్మలున్నాయని గుర్తుచేసి.. కేసీఆర్‌ని వాళ్లతో పోల్చే ప్రయత్నం చేశారు అధికారులు.

ఏ ఆలయంపైనైనా అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సహజమేనని కిషన్‌రావు ఇచ్చిన వివరణపై తెలంగాణ సమాజం మరింత అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కావని, ఫలానా బొమ్మలు చెక్కమని శిల్పులకు ఎవరూ చెప్పలేదని కిషన్‌రావు బుకాయించడం ప్రభుత్వ పలాయనవాదానికి తార్కాణమని నేతలు దుయ్యబడుతున్నారు.
అన్ని దేవాలయాల కంటే యాదాద్రికి మంచి పేరుందని, ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఓ యజ్ఞంలా కట్టిస్తోందని ఇంత జరిగాక కూడా కిషన్‌రావు సమర్ధించడానికి చేసిన ప్రయత్నం విమర్శలకు తావిస్తోంది. ఆలయంలో మొత్తం ఐదువేల శిల్పాలుంటాయని, రాజకీయ ప్రతిమలు చెక్కారా లేదా అన్నదే పరిశీలించమని కిషన్‌రావు చెప్పడంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.