యాదాద్రి: శ్రీలక్ష్మీ నారసింహుని దివ్యక్షేత్రంపై బూతుబొమ్మలు కూడా కొత్తగా పెడుతున్నారన్న సమాచారంపై విచారణ జరిపిస్తానని దేవస్థానం పునర్ నిర్మాణ బాధ్యతల్నిపర్యవేక్షిస్తున్న అధికారి (YTDA CEO) కిషన్‌రావు చెప్పారు. భక్తుడు పంపించిన బూతు చిత్ర శిల్పాలపై వివరణ అడిగినప్పుడు కిషన్‌రావు… ‘బూతు బొమ్మలా.. అలాంటిది ఏమి లేదు’ అని తేల్చిచెప్పారు. ఐతే, అక్కడ తయారు చేసిన 5000 రాతి స్తంభాలపై వున్న అన్ని బొమ్మలు మీరు పరిశీలించారా.. అని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర సరైన జవాబు దొరకలేదు. ‘అన్నీ చూడలేదు కానీ, బూతు బొమ్మలు వుండే ఆస్కారం లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికీ తప్పు వార్త అని చెప్తూనే నిన్న బయటకి వచ్చిన కేసీఆర్, కార్, సర్కారు పథకాల బొమ్మలు మేము చెప్పి చేయించినవి కావని కిషన్‌రావు మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘శిల్పులు తమకు నచ్చిన బొమ్మలు చెక్కుతారు, కొన్నిసార్లు వాళ్ళ కుటుంబ సభ్యుల బొమ్మలు కూడా చెక్కిన ఉదంతాలు వున్నాయి’ అని అర్ధంపర్ధం లేని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ పర్యవేక్షణాధికారి. కానీ, ఇంత నిరసన వెల్లువెత్తిన తరువాత కూడా ఈ రాజకీయ చిత్రాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పడం ఆశ్చర్యం. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని కిషన్‌రావు ‘తొలివెలుగు’తో అన్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » బూతుబొమ్మలా.. చూడలేదు!