అనుకున్నట్లే అటు తిరిగి, ఇటు తిరిగి యురేనియం అంశం టీఆరెస్ మెడకు చుట్టుకునేల కనపడుతోంది. ఒక్క నల్లమలలొనే కాదు రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు ఎక్కడ చేప్పట్టినా వ్యతిరేకిస్తాం అంటూ కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలు చేసి ఏకంగా అసెంబ్లీ, మండలిలో తీర్మానాలు చేసినా, బీజేపీ ఒక్కమాటతో అదంతా బూడిదలో పోసిన పన్నీరై పోయింది.
యురేనియం తవ్వకాలకు యూపీఏ హయాంలోనే అనుమతులు వచ్చాయి, అప్పట్లోనే అన్ని అనుమతులు కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్తూ వచ్చింది. అయితే, ఆ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి నేతలతో పాటు పవన్ కళ్యాణ్ సహా ఇతర పర్యావరణ పరిరక్షణ నేతలంతా ముక్తకంఠంతో అనుమతులు రద్దు చేయాలని కోరగా, సినిమా ఇండస్ట్రీ సహా అన్ని రంగాల నుండి వ్యతిరేకత రావటంతో టీఆరెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టి, మైనింగ్‌కు అనుమతించం అని చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేసింది.
అయితే, బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఒక్క కామెంట్ టీఆరెస్‌ను ఇరకాటంలోకి నెట్టటంతో పాటు యురేనియం తవ్వకాల మొత్తం వ్యవహారం టీఆరెస్ మెడకు చుట్టుకునేల చేసింది. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర స్థాయిలో అనుమతి ఇచ్చింది టీఆరెస్ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని కమిటీయే అని, దీంట్లో కొత్తగా బీజేపీ ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. అనవసరంగా బీజేపీని బద్నాం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ మీటింగ్‌లో 2016లొనే టీఆరెస్ ప్రభుత్వం యురేనియం మైనింగ్‌కు అనుమతిచ్చిందని, ఆధారాలతో సహా బయటపెట్టారు.