వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఢిల్లీలో వైభవంగా మహంకాళి అమ్మవారి బోనాల పండుగ నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల వేడుకలు బుధవారం ముగిశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి బంగారుబోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
ఢిల్లీలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి బోనాల పండుగను అనేక సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి అన్నారు. లాల్‌దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాలను ఎపీ భవన్, తెలంగాణ భవన్‌లోనూ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో ఏడేండ్లుగా మహంకాళి ఆలయ కమిటీ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉత్సవాల కోసం రాష్ట్రం నుంచి 300 మంది భక్తులు, కళాకారులు దేశ రాజధానికి వెళ్లారు. ఉత్సవాల్లో భాగంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు డోలు దరువులు, అమ్మవారి వేషధారణ, పులి వేషాలు ఆకట్టుకున్నాయి.