– మోడీ పాలనపై చర్చకు సిద్ధం
– గన్ పార్క్ కు వస్తావా?
– కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్
కేంద్రంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గన్ పార్క్ దగ్గరకు చర్చకు సిద్ధమా? అని సవాల్ చేయగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం అదే ఛాలెంజ్ విసిరారు. సీనియర్ పాత్రికేయుల సమక్షంలో మోడీ ఏడేళ్ల పాలనపై కేసీఆర్ తో చర్చకు సిద్ధమని ప్రకటించారు. సీఎం సవాల్ ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తున్నానని తెలిపారు.
బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు కిషన్ రెడ్డి. హుజూరాబాద్ ఫలితాలతో ఆ భయం ఇంకా ఎక్కువైందని సెటైర్లు వేశారు. ఎవరు వ్యతిరేకించినా సహించడం లేదని.. కేసీఆర్ వ్యవహార శైలి తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇంత దిగజారుతారా? అని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారని చెప్పారు. తనను ప్రశ్నించే వాళ్లు ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారన్నారు.
కేంద్రంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు కిషన్ రెడ్డి. మోడీని అవమానించేలా సీఎం మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు. టీఆర్ఎస్,కేసీఆర్ వాడే భాషలో తాము మాట్లాడలేమన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అనుగుణంగా, సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ మాటలున్నాయని మండిపడ్డారు. నిజాం పరిపాలనలా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రధాని, బీజేపీపై అవాస్తవాలతో కేసీఆర్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఆయన మాట తీరు ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉందని వ్యాఖ్యానించారు. నియంతల మాదిరిగా తరతరాలు పాలించేందుకు కొత్త రాజ్యాంగం తేవాలని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు.