సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్‌తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని చెప్పారు. బీఆర్ఎస్ రానంత మాత్రాన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతోందా? అని ప్రశ్నించారు. ట్విన్ టవర్స్ శిలా ఫలకంపై స్థానిక ఎంపీనైన తన పేరు కూడా లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ఆహ్వానించక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. గవర్నర్ ను ఎందుకు ఆహ్వానించ లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు కావాలనే అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
రేపటి నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవటం బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం రాకపోవడం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ నష్టపోతోందని చెప్పారు. కేంద్రంతో ఘర్షణాత్మకమైన వైఖరి ప్రదర్శిస్తే రాష్ట్రానికే నష్టమన్నారు. అవకాశం ఉన్న చోట తెలంగాణ వాయిస్ వినిపించటంలో కేసీఆర్ విఫలం అయ్యారని అన్నారు.
ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మకమైన వైఖరి వల్ల తెలంగాణకు నష్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రకు వెళ్ళేందుకు సీఎం కేసీఆర్ కు తీరిక దొరుకుతుందని అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ జయంతికి పూలమాల వేయటానికి కేసీఆర్‌కు తీరికలేదా అని ప్రశ్నించారు.