అక్రమాలు, అన్యాయాలకు కేసీఆర్ కుటుంబం పెట్టింది పేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అబద్దాలకు పెద్ద బిడ్డలు కేసీఆర్ కుటుంబ సభ్యులని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. బీజేపీపై కేసీఆర్ కుటుంబం పూర్తిగా అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు.
ప్రస్తుతం కేసీఆర్ కు ఉన్న గద్దె ఊడేలాగా ఉందన్నారు. ఇక ఆయన ఢిల్లీ గద్దెను ఎక్కడ ఎక్కుతాడని ఆయన ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లు, దళితున్ని సీఎం చేయడం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీలో కేసీర్ ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉందా అని ఆయన ప్రశ్నించారు.
కొత్త ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలనే తీసివేస్తున్నారని చెప్పారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్స్ ఎక్కడ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారని ఆయన అడిగారు. కేసీఆర్ కేబినెట్లో 50శాతం ఉద్యమ ద్రోహులే ఉన్నారని ఫైర్ అయ్యారు.
ప్రపంచంలో ఏ ప్రధాని చేయని గొప్ప పనులు ఈ ఎనిమిదేండ్లలో మోడీ చేస్తున్నారని పేర్కొన్నారు. అదే టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ ఒక్క రోజు కూడా సెక్రటరేట్ కు రాడన్నారు. సీఎంకేసీఆర్ అయితే ఫార్మ్ హౌస్ లేదా ప్రగతి భవన్ కు మాత్రమే పరిమిత మవుతారని చెప్పారు.
యూపీ సీఎం యోగి మొదలు సీఎంలందరూ ప్రజలను కలుస్తారని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ప్రజలను కలవరన్నారు. తెలంగాణ ప్రజల పాలిట సీఎం కేసీఆర్ శాపంగా మారారని అన్నారు. సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అక్రమాలకు అంతేలేకుండా పోయిందన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతోందన్నారు. ఈ సందర్బంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళులర్పిస్తున్నాని చెప్పారు.