టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయం నడుస్తోందని, టీఆర్ఎస్ అరాచకాలు పెరిగిపోయాయని విమర్శంచారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియాపై నిర్బంధం పెరిగిపోయిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తే లేని ఇబ్బంది.. బీజేపీ కార్యకర్తలు చేస్తే ఎందుకు వేస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని, రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించారు. మళ్ళీ గెలుస్తామో లేదో.. ఉన్నప్పుడు దోచుకుందామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు పోలీసులను కీలుబొమ్మలుగా చేసుకున్నారని ఫైర్ అయ్యారు.
గత 8 సంవత్సరాలుగా ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర సర్కారు 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. బీజేపీ సర్కారు దేశానికంతటికీ ఒకే పాలసీని తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం గజ్వేల్, సిరిసిల్లకు ఎంతిచ్చారు.. దుబ్బాకకు ఎంతిచ్చారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
సాయి గణేష్ ఓ సాధారణ కారు డ్రైవరని.. తన అమ్మమ్మ వద్ద ఉంటారని, నెలలో 15 రోజులు బీజేపీ కోసం పనిచేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పోలీసులు సాయి గణేష్‌పై 16 కేసులు పెట్టారని.. 3 సార్లు జైలుకు పంపించి రౌడీషీట్ తెరిచి వేధించారని తెలిపారు. కొద్దిరోజుల్లో పెళ్లి కావాల్సిన సామాన్య కార్యకర్తని వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన ధ్వజమెత్తారు. తన ఆత్మహత్యకు కారణం ఏందో మీడియా ముందు తెలిపారని.. అయిన కేసు నమోదు చేయలేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్‌పై కేసు పెట్టారు.. కానీ, కారణం అయిన వారి పై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ప్రజలు ఎలా గెలిపించారో వచ్చే ఎన్నికల్లో అలాగే ఓడిస్తారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ ప్రశ్నిస్తే తెలంగాణ సెంటిమెంట్‌కి ముడిపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రగతిభవన్ కల్వకుంట్ల ప్రగతిభవన్గా ఉందని.. దానిని భవిష్యత్‌లో తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని అన్నారు.