ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరిగాయన్నారు. ఎఫ్ సీఐ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 40 రైస్ మిల్లులో తనిఖీలు చేశారని.. 4,53,890 లక్షల సంచుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు తేల్చారని వెల్లడించారు. ఆ ధాన్యాన్ని ఎక్కడికి తరలించారో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తక్కువ ధాన్యం ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైస్ మిల్లులపై తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన రైసు మిల్లులపై ఏలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ కోరుతు త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు లేఖ రాయనున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. తమ వద్దనున్న బియ్యాన్ని కొనాలంటూ.. ఏప్రిల్ 13న తెలంగాణ సివిల్ సప్లయ్ కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారని.. అందుకు కేంద్రం వెంటనే స్పందించి ఆమోదించిందని గుర్తుచేశారు కిషన్ రెడ్డి.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు రైతులనుంచి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యలేదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలలో టీఆర్ఎస్ ఆటలాడుతూ.. కేంద్రమే వడ్లు కొనాలని తండ్రికొడుకులు ఘర్షణ వాతావరణం సృష్టించారని ఆరోపించారు. కేంద్రం వద్ద అన్ని రాష్ట్రాలకూ ఒకే న్యాయం ఉంటుందని.. అగ్రిమెంట్ ప్రకారమే అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కనీసం వడ్లు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద బస్తాలు లేకుండా పోయాయన్నారు. ఇప్పుడు తండ్రికొడుకులు చెరో తట్ట పట్టుకొచ్చి వడ్లను లారీల్లో నింపుతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయబోమని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కావాలనే ఉద్దేశ పూర్వకంగా ప్రధానినీ తిట్టడం.. మోడీని దేశం నుంచి తరిమి కొడతామని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలువుతామని మాటలు మాట్లాడి.. ఇతర రాష్ట్రాల సీఎంలు, పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడారని.. అన్ని తెలిసి కూడా ఓపికగా ఉంటున్నామని.. తమ మంచితనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు కిషన్ రెడ్డి.