త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర తెలంగాణలో రెండోరోజు సూర్యాపేటకు చేరుకుంది. ముందుగా కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం.. చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా అవార్డు పొందిన మెరుగు మారతమ్మ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేశారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆమెను సన్మానించారు. కరోనా పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా ఆమె విధుల్లో పాల్గొన్నారని కొనియాడారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నామని… కరోనాను అరికట్టాలంటే ప్రజల సహకారం ఉండాలన్నారు కిషన్ రెడ్డి. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు రూ.5 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తుందని చెప్పారు. కరోనా వారియర్స్ ను ప్రోత్సహించాలన్న ఆయన.. గాంధీ ఆస్పత్రిని తొమ్మిది సార్లు పరిశీలించానని చెప్పుకొచ్చారు.
ఇక సూర్యాపేట పర్యటన తర్వాత మహబూబాబాద్ జిల్లాకు వెళ్లారు కిషన్ రెడ్డి. అక్కడ జన ఆశీర్వాద యాత్రను కొనసాగిస్తున్నారు. తొర్రూరులో ప్రసంగిస్తూ అందరూ మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని… ఆఖరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు కిషన్ రెడ్డి.