తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి రాష్ట్ర రాజకీయాల్లో మరింత దూకుడు పెంచే చాన్స్ దొరికింది. ఇన్నాళ్లు పరోక్షంగా తనకు స్పీడ్ బ్రేకర్‌గా మారిన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇక తమిళనాడుకు వెళ్లనున్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. కిషన్‌రెడ్డిని ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమించింది అధిష్టానం. దీంతో మరో మూడు, నాలుగు నెలల వరకు ఆయన అక్కడే ఉంటారు. దీంతో బండి సంజయ్‌కి మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం దొరికినట్టయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ.. ఇప్పటికీ పార్టీ కంట్రోల్ పూర్తిగా ఆయన చేతుల్లో లేదన్నది చాలా మంది వాదన. గతంలో దీర్ఘకాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఉండటంతో కిషన్ రెడ్డి హవా ఇంకా కొనసాగుతోందని కార్యకర్తలు చెప్పుకుంటుంటారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేరుతో రాష్ట్రంలో బీజేపీకి రెండు వపర్ సెంటర్లు ఉన్నాయంటూ విశ్లేషించేవారు. ఫలితంగా బండి సంజయ్ తీసుకున్న నిర్ణయాలపై కొన్నిసార్లు పార్టీ నేతలే వ్యతిరేకించిన సందర్భాలు కనిపించాయి. వాటి వెనుక కిషన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నారన్న అభిప్రాయాలు వినిపించేవి. ఈ పరిణామాల క్రమంలో.. ఇప్పుడు కిషన్ రెడ్డి తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జిగా వెళ్తుండటంతో బండి స్పీడ్ కచ్చితంగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.