హైదరాబాద్ లో సైన్స్ సిటీ కోసం 25 ఎకరాల స్థలం కావాలని అడుగుతుంటే సీఎం కేసీఆర్ నుంచి స్పందన లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటిదాకా ఈ విషయంలో రెండు సార్లు లేఖ రాశానని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
జాతీయ సైన్స్ వారోత్సవాల్లో భాగంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, రాజమండ్రిలో కూడా సైన్స్ సిటీ యూనిట్స్ పెట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అంతా సైన్స్దేనన్న కిషన్ రెడ్డి.. ప్రాచీన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి బలమైన పునాదులు ఉండేవన్నారు.
స్టార్టప్ కంపెనీల్లో ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు కిషన్ రెడ్డి. అలాగే రక్షణ శాఖకు అవసరమైన ఎక్విప్ మెంట్ కూడా మన దేశంలోనే తయారు చేసుకుంటున్నామని వివరించారు. విదేశాలకు కూడా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం తరఫున శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నామని.. కరోనా వ్యాక్సిన్ తయారీ పరిశ్రమలను ప్రధాని మోడీ నేరుగా పరిశీలించారని చెప్పారు కేంద్రమంత్రి. అజాదికీ అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రతీరంగంపై సమీక్ష చేసుకుంటున్నామన్నారు. యువత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందన్న ఆయన.. మేధో సంపత్తి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.