నవంబర్ 4 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత బంధు ఆగదని.. ఆపేవారు ఉండరని.. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పిన మాట. నవంబర్ 4 వెళ్లిపోయి నెల రోజులు దాటింది. కానీ.. సారు మాత్రం సైలెంట్. ఆ ఊసే ఎత్తడం లేదు. ఎప్పుడో వచ్చే యాసంగి పంట కోసం కేంద్రంపై యుద్ధమంటూ హంగామా చేయిస్తున్నారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు, దళిత బంధు గురించి ప్రజలు మాట్లాడుకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోళ్లు అంటూ కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కేసీఆర్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితులను కేసీఆర్ మభ్యపెట్టారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన.. దళితులకు మేలు చేసే ఉద్దేశం ఉంటే తక్షణమే దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీపై నిందలు వేసి వరద బాధితులకు నష్టపరిహారం ఎగ్గొట్టిన విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఇప్పుడు మరోసారి తమ మీద బురద జల్లి దళితు బంధును పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ వన్నీ మాయమాటలేనని ఆరోపించారు కిషన్‌రెడ్డి.