హైదరాబాద్‌లో రోహింగ్యాల అంశంపై కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నగరంలో రోహింగ్యాలు ఉన్నారని చెప్పే వివరాలన్ని తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. రోహింగ్యాలకు సంబంధించిన నగరంలో ఓ కాలనీ కూడా ఉందని ఆయన చెప్పారు. పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కొన్ని చోట్ల వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో సహకరించినందుకుగాను.. ఇప్పటికే కొందరు పోలీసులు సస్పెండ్ అయ్యారని అన్నారు. రోహింగ్యాలతో పాటు పాస్‌పోర్టు గడువు ముగిసిన పాకిస్తానీలు కూడా ఆశ్రయం పొందుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్‌లో రోహింగ్యాలకు అక్రమంగా ఆశ్రయం కల్పిస్తూ వారికి ఓటర్, రేషన్ కార్డులు ఇస్తున్నారని టీఆర్ఎస్, ఎంఐఎంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. నగరంలో 13 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్తోంది. అయితే అంత మంది రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తోందని ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న వేళ.. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.