రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కేసీఆర్.. అంబేడ్కర్ అవమానించేలా మాట్లాడటం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ఉండి.. తన స్థాయిని మరిచి రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరిచే విధంగా కేసీఆర్ మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు పరిచారో చెప్పాలని నిలదీశారు. రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. యూరియాపై ఎంత రాయితీ ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణలో ధర్నా చౌక్ ఎత్తేసిన సీఎం కేసీఆర్.. రైతుల ఉద్యమం గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. సంవత్సర కాలం పాటు రైతులు ఉద్యమం చేసినా వారికి అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను సైతం జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్దారు.
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకు సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు ఏకాపాత్రాభినయం చేశారని విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి. ప్రజలను ఆకట్టుకుని మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు, మాట తప్పిన తీరుపై ప్రశ్నించిన ఆయన.. అందుకు సంబంధించిన వీడియోలను సమావేశంలో ప్రదర్శించారు.
ప్రగతిభవన్ కు వచ్చి కేసీఆర్ కు చెక్ ఇచ్చి.. ఆయన కుటుంబానికి డబ్బులు పంచితేనే రాష్ట్రానికి నిధులు ఇచ్చినట్టా..? అని ప్రశ్నించారు. మోడీ దేశానికి ప్రధాన సేవకుడిగా పని చేస్తుంటే.. కేసీఆర్ కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసం పని చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 2014 నాటికి తెలంగాణలో 2,511 కి.మీ. జాతీయ రహదారులుంటే గడిచిన ఏడేళ్లలో 4,993 కి.మీ.కు పెరిగాయని కేంద్రమంత్రి గుర్తుచేశారు.