పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కార్మికుల వైద్య అవసరాలను గుర్తించి.. హైదరాబాద్ తో పాటు.. ఇతర జిల్లాల్లోనూ ఈఎస్ఐ వైద్య సేవలను అందించేలా చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 2018 లోనే రామగుండంలో వంద పడకల అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించిందని పేర్కొన్నారు. ఈ మేరకు అప్పుడే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. కేంద్ర కార్యాలయం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందనే విషయాన్ని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.
ఆ తర్వాత కూడా ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయం అనేక సార్లు రాష్ట్రప్రభుత్వానికి లేఖలు రాసిందని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదనే విషయాన్ని గుర్తు చేశారు.దీనికి సంబంధించి తాజాగా.. మే నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశలో రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కావల్సిన భూమి ప్రస్థావన వచ్చిందన్నారు.
భూమి కేటాయింపులో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి చర్చించడం జరిగిందని లేఖలో రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రామగుండం పరిసర పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సీఎం వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని సత్వరమే ఆసుపత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.