- పథకం ప్రకారమే హింసాత్మక ఘటనలు..!
- రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై కిషన్ రెడ్డి ఫైర్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెను విధ్వంసం.. హఠాత్తుగా అనుకోని రీతిలో ఆందోళనకారుల హింసాత్మక ఘటనలతో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోగీల దగ్ధం, పోలీసులపై రాళ్లు రువ్వడం సహా జరుగుతున్న సంఘటనలు అదుపులోకి రాకపోవడంతో పోలీసుల కాల్పులకు దారితీశాయి. ఈ సంఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఫోన్ లో ఆరా తీశారు. హింసకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం.
ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిన ఆందోళనలు క్రమంగా దక్షిణాదికి చేరడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వీటికి చెక్ పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది.
మరోవైపు అగ్నిపథ్ పథకంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అమిత్ షా సహా పలువురు నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని అన్నారు. అయితే ఈ ఘటన పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. ఉదయం నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాంటూ వ్యాఖ్యానించారు.
Advertisements
శాంతిభద్రతలు రాష్ట్రం చేతుల్లో ఉంటాయన్న కిషన్ రెడ్డి.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. చాలా దేశాల్లో అనేక విధానాలను పరిశీలించిన తరువాతే అగ్నిపథ్‌ను తీసుకొచ్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు, యువతలో దేశభక్తి, నైపుణ్యం పెంచే ప్రయత్నమే కానీ.. అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.