పర్సులు దొంగతనం చేయడం విన్నాం.ఇంటికి కన్నం వేసి డబ్బు,బంగారం ఎత్తుకు పోవడం విన్నాం. కానీ బస్సు ఎత్తుకు పోవడం విన్నారా.అవునండి..! కర్ణాటక బస్సుని మాయం చేసారు దుండగులు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.!
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో కల్యాణ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు చోరీకి గురైంది. చించోలీ బస్టాండ్, రెండో నెంబరు ప్లాట్‌ఫాం వద్ద ఉన్న ఈ బస్సును అక్కడే పచార్లు చేస్తున్న కొందరు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు.
చోరీకి గురైన బస్సు బీదర్ నుంచి చించోలీ బస్టాండ్‌కు చేరుకుంది. ఇక్కడ రెండో నెంబరు ప్లాట్‌ఫాం వద్ద దీనిని పార్క్ చేశారు. డ్రైవర్, కండక్టర్ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు.
మంగళవారం ఉదయం డ్రైవర్ వచ్చి చూసేసరికి బస్సు కనిపించలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ బస్సు తాండూరు మార్గంలో తెలంగాణా వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ దొంగతనం ఇంటి మనుషుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
2021 అక్టోబరులో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. తుమకూరు జిల్లాలో పార్క్ చేసిన బస్సును కొందరు దుండగులు పట్టుకెళ్లిపోయారు. 30 కిలోమీటర్ల దూరంలో ఆ బస్సును వదిలేసి, దానిలోని డీజిల్‌ను పట్టుకెళ్లిపోయారు.