జట్టులోకి వస్తూ పోతూ… తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయిన టీంఇండియా ఆటగాడు కే ఎల్ రాహుల్ న్యూజిలాండ్ టూర్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. టీ20తో పాటు వన్డేల్లోనూ తనపై ఉన్న అంచనాలను అందుకునేలా పరుగులు సాధించగలిగాడు.
అయితే, చివరిదైన మూడో వన్డేలో కే ఎల్ రాహుల్, న్యూజిలాండ్ ఆటగాళ్ల మధ్య గొడవ మొదలు కావటంతో ఎంపైర్స్ జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. అలా ఒక్కసారి కాదు… రెండుసార్లు కావటం గమనార్హం.
ఫాస్ట్ బౌలర్ జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో బంతిని మిడాన్ మీదుగా ఆడి సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ వైపు పరుగెత్తాడు కే ఎల్ రాహుల్. కానీ అప్పటికే బాల్ విసిరిన నీషమ్ బంతి విసిరాక పిచ్ నుండి వెనక్కి వస్తూ రాహుల్‌కు అడ్డుగా వెళ్లాడు. దీంతో అతన్ని ఢీకొట్టబోయిన రాహుల్ చివరి నిమిషంలో పక్క నుండి వెళ్లి పరుగు పూర్తి చేశాడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే తనకు అడ్డు వచ్చాడని రాహుల్ నీషమ్‌పై వ్యాఖ్యానించాడు. దీంతో అంపైర్స్ జోక్యం చేసుకొని సర్ధిచెప్పటంతో రాహుల్ కూడా వెనక్కి తగ్గాడు.
కానీ తరువాత బాల్‌కు నీషమ్ తన నోటికి పని చెప్పటంతో రాహుల్ ఆవేశంతో ఊగిపోయాడు. నీషమ్‌పై ఆవేశంగా దూసుకెళ్లె ప్రయత్నం చేయటంతో… నీషమ్ పక్కకు తప్పుకున్నాడు. కానీ రాహుల్ మోచేతి నీషమ్‌కు తగిలింది. మొన్నటి వరకు క్రీడా స్ఫూర్తి అంటూ న్యూజిలాండ్-ఇండియా ప్లేయర్స్‌ను కొనియాడిన అభిమానులు తాజా సంఘటనతో ఆగ్రహంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కే ఎల్ రాహుల్ సెంచరీ చేసి… టీంఇండియా గౌరవప్రదమైన టార్గెట్ ఇవ్వటంలో కీలక భాగస్వామి అయ్యాడు.
అయితే, న్యూజిలాండ్ ప్లేయర్ నీషమ్, కే ఎల్ రాహుల్ కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఒకే జట్టుకు ఆడనుండటం విశేషం.