నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై పూలదండతో వచ్చారని బాధితురాలు ప్రీతి సోదరి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సోదరిని ఆస్పత్రి పాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, తక్షణమే ప్రత్యేక కమిటీని నియమించి కేఎంసీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రీతి సోదరి డిమాండ్ చేసింది.
బాధితురాలికి అన్యాయం చేస్తే తమ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని ఆమె హెచ్చరించింది. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థినికి సరైన వైద్యం అందడం లేదని, రాజకీయ నాయకులెవరూ పరామర్శించడానికి రావొద్దని కోరింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి సోదరి ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే బాధితురాలి సోదరి వ్యాఖ్యలపై రాజ్ భవన్ రియాక్ట్ అయింది. మెడికల్ స్టూడెంట్ ని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్ లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూలదండ ఉంచామని స్పష్టం చేసింది. గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్ భవన్ కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్ లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా ఉందని వివరించింది.
అలాగే హనుమంతుడి గుడిలో బాధితురాలు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ప్రార్థించారని తెలిపింది. ఈ ఘటనపై గవర్నర్ రాజ్ భవన్ కు వచ్చిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆదేశించారని రాజ్ భవన్ స్పష్టం చేసింది.