పూంచ్ లో తాను నవగ్రహ ఆలయానికి వెళ్లి అక్కడి శివలింగానికి జలాభిషేకం చేయడంపై వెల్లువెత్తిన నిరసనలు, ఆరోపణలకు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ దీటైన సమాధానమిచ్చారు. తన మతమేమిటో తనకు తెలుసునని, ఒకరు నేర్పవలసిన అవసరం లేదని అన్నారు. ఆలయంలో ఆమె చేసిన పూజలు, శివలింగానికి అభిషేకం చేయడం అంతా డ్రామా అని,గిమ్మిక్కు అని బీజేపీ ఎద్దేవా చేయగా, ఇది ఇస్లాం వ్యతిరేకమని ముస్లిం గురువు ఒకరు ఆరోపించారు.
మెహబూబా చేసిన పనిని ఇస్లాం వ్యతిరేకిస్తుందని యూపీకి చెందిన బీజేపీ నేత దేవ్ బంద్ మౌలానా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో… ఆమె గానీ, మరే సాధారణ ముస్లిం గానీ ఇలా చేయడం మన సాంప్రదాయ విరుద్ధమని ఇత్తెహాద్ ఉలేమా-ఏ-హింద్ జాతీయ ఉపాధ్యక్షుడు ముప్తి అసద్ కాస్మి పేర్కొన్నారు. మెహబూబా ముఫ్తి తన మతాన్ని విడనాడాలని ఆయన ఆగ్రహంగా అన్నారు
. ఇస్లాం సంప్రదాయాలకు భిన్నంగా ఆమె నడచుకొందన్నారు. కానీ గురువారం మీడియాతో మాట్లాడిన ముఫ్తి .. మనది సెక్యులర్ దేశమని, మనం ‘గంగా జమునా తెహ్ జీబ్’ ని అనుసరిస్తున్నామని చెప్పారు. అన్ని మతాలనూ తాను గౌరవిస్తానని, మన నాయకుడు దివంగత యశ్ పాల్ శర్మ నిర్మించిన ఆలయానికే తను వెళ్లాలని ఆమె అన్నారు.
ఇది అందమైన టెంపుల్ అని, ఎవరో తనకు కలశంలో పవిత్ర జలాన్ని ఇచ్చారని, ఆ వ్యక్తి చూపిన ఆదరాభిమానాలకు ముగ్ధురాలినైన నేను శివలింగానికి జలాభిషేకం చేశానని ఆమె పేర్కొన్నారు. ‘బీజేపీ నాయకులు గానీ, ఇతరులు గానీ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించబోను.. ఇది నా వ్యక్తిగత విషయం’ అని మెహబూబా ముఫ్తి అన్నారు. పూంచ్ జిల్లాలో ఆమె రెండు రోజులు పర్యటించారు.