రాజ్యాంగం ప్రతి పౌరుడికోసం ఉద్దేశించిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పౌరులు రాజ్యాంగం ప్రకారం తమకు సంక్రమించిన హక్కులు, విధుల గురించి తెలుసుకున్నప్పుడే రాజ్యాంగం వర్ధిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జస్టిస్ హుదయతుల్లా నేషనల్ లా వర్సిటీ స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో రాజ్యాంగం గురించిన పరిజ్ఞానం చాలా కొద్ది మందికి మాత్రమే పరిమితమైనట్టు ఆయన తెలిపారు. ఆధునిక స్వతంత్ర భారతదేశ ఆకాంక్షలను నిర్వచించే ఈ అత్యున్నత రాజ్యాంగ పరిజ్ఞానం కేవలం న్యాయ విద్యార్థులు, న్యాయ వాదులు, మరి కొద్ది మంది విద్యావంతులకు మాత్రమే పరిమితం కావడం విచారకరమన్నారు.
అందువల్ల సామాన్యుల్లోకి రాజ్యాంగాన్ని తీసుకు వెళ్లిన మిషన్ ను లా గ్రాడ్యుయేట్లు చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యాంగ సంస్కృతిని పెంపొందించడం, అవగాహన కల్పించడం మనందరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలను సరళమైన పదాలలో వివరించడం, దాని నైతికతను ప్రజల మనస్సుల్లోకి చేర్చడం మన ప్రయత్నంగా ఉండాలని చెప్పారు.
న్యాయ సహాయ ఉద్యమంలో భాగస్వాములు కావాలని యువ న్యాయవాదులను కోరారు. ఉద్యమాన్ని సరైన దిశలో నడిపించడానికి తమకు యువ ప్రతిభావంతులైన న్యాయవాదులు అవసరమన్నారు. మిమ్మల్ని చేరుకోలేని వ్యక్తుల వద్దకు మీరే స్వయంగా వెళ్లండని సూచించారు.
సమాజంలో ప్రబలంగా ఉన్న సామాజకి సమస్యలను అర్థం చేసుకోవాలని అన్నారు. వాటి పరష్కారానికి ప్రజలతో కలిసి నిలబడండని చెప్పారు. మీకు వీలైనప్పుడల్లా ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడానికి, చట్ట పరంగా వారికి గైడెన్స్ ఇవ్వండని సూచనలు చేశారు.