మూడు రాజధానుల అంశం మాదిరిగానే మూడు రాష్ట్రాల నినాదం ఏపీలో ఊపందుకుంటోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని కొందరు నేతలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిలో మునిగిపోయిన, పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా.. చూస్తూ కూర్చొంటామా? దేశభక్తులం.. తీవ్రవాదిలా మారుతా.. ఇంకోసారి ఏపీని విడగొడతామంటే.. తోలు తీసి కింద కూర్చోబెడతాం అంటూ ఘాటు విమర్శలు చేశారు.
పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ అంటే మామూలుగా కాదు. ఆయన మాటల స్టయిల్ మాదిరిగానే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీవ్రవాదిలా మారితే.. కుక్కను కాల్చినట్లు కాల్చేస్తారని హెచ్చరించారు నాని. ఉత్తరాంధ్ర ప్రజలు రాష్ట్రం కావాలని అడిగితే, ప్రజలను పవన్ కళ్యాణ్ చంపేస్తాడా అని ప్రశ్నించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకే 3 ప్రాంతాల అభివృద్ధి విధానం తీసుకొచ్చామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు కొడాలి నాని. లక్షల కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడతామని మీరు అంటున్నారు.. రేపు ఆ ప్రాంతంలో ఉన్న తనలాంటి వాళ్ళు పొమ్మంటే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని మండిపడ్డారు. పవన్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవ చేశారు.
తమకు 55 శాతం ఓటు బ్యాంకు ఉంది.. అందరూ కట్ట కట్టుకొని వచ్చినా ఏం చేయలేరని అన్నారు నాని. బతికి ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే స్విమ్మింగ్ పూల్ లో ఫారిన్ అమ్మాయిలను పెట్టుకుని మందు తాగటమా? అంటూ లోకేష్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు నాని.