తమిళనాడులోని కొడనాడు ఎస్టేట్ కు యజమానిని తానేనంటూ తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ఆదాయపు పన్ను శాఖాధికారులకు తెలిపారు. శశికళ తరపున ఆమె ఆడిటర్ ఈ విషయాన్ని తెలియజేశారు. గతంలో శశికళ కుటుంబసభ్యుల నివాసాలు, సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో మెరుపు దాడులు చేసి కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై విచారణ చేస్తున్న ఐటీ అధికారులకు వాస్తవాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంటలో కొడనాడు ఎస్టేట్ కూడా ఉంది. నోట్ల రద్దు సమయంలో రద్దయిన రూ.1900 కోట్లతో ఆ ఎస్టేట్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీనిపై అక్టోబర్ 22 లోపు వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు జైల్లోని శశికళకు నోటీసులు పంపారు. అయితే ఆ నోటీస్ అక్టోబర్ 19 నే అందిందని..మూడు రోజుల్లో వివరణ ఇవ్వడం కుదరదని.. నెల రోజుల గడువు కావాలని శశికళ తరపు ఆడిటర్ కోరారు. దీంతో ఐటీ అధికారులు 15 రోజుల గడువిచ్చారు. అయినప్పటికీ సమాధానం ఇవ్వకుండా ఈ నెల 11 వ తేదీన సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. రద్దయిన నోట్లతో తాను కొడనాడు ఎస్టేట్ ను కొనుగోలు చేయలేదని తన ఆస్తుల వివరాలను మొత్తం వెల్లడించారు. తనకు ఏ సంస్థల్లో భాగస్వామ్యం ఉందో తెలుపుతూ కొడనాడు ఎస్టేట్ లో కూడా భాగస్వామినని…జయలలిత మరణాంతరం దానికి యజమానినని తెలియజేస్తూ ఐటీ అధికారులకు వివరణ ఇచ్చారు.