– తొలివెలుగుతో మాట్లాడిన కోదండరాం
– విలీనం వార్తల్ని ఖండిస్తూ ప్రకటన
– కానీ… ఇబ్రహీంపట్నంలో రహస్య భేటీ!
– మరింత ఊపందుకున్న ఊహాగానాలు
పంజాబ్ లో విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలపై మరింత దృష్టి పెట్టింది. వాటిలో తెలంగాణ ఒకటి. త్వరలో పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆప్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నారు. ప్రతీ అంశంలోనూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదే.. ఆప్ లోకి టీజేఎస్ విలీనం.
ఆప్ తెలంగాణ ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ముందు విలీనం ప్రతిపాదన తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలివెలుగు కోదండరాంను సంప్రదించింది. విలీనం వార్తల్లో నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. పంజాబ్ లో ఆప్ గెలుపుపై అభినందనలు తెలిపేందుకే తమ పార్టీ నేతలు ఆప్ నాయకులను కలిసినట్లు తెలిపారు కోదండరాం. అసలు.. విలీనం చర్చే జరగలేదని స్పష్టం చేశారు.
తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఎవరితోనైనా కలిసి పని చేస్తామన్నారు కోదండరాం. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో ప్రజా క్షేమం కోరుతూ ఏ కార్యక్రమం చేసినా మద్దతు తెలుపుతామని చెప్పారు. అయితే… టీజేఎస్ నేతలు రహస్య భేటీ నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫాంహౌస్ లో టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. దీనికి కోదండరాంతో పాటు, పార్టీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. దీంతో కోదండరాం పైకి విలీనం లేదని చెబుతూ.. సైలెంట్ గా ఏదో చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. గతంలో బీజేపీ, కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ.. అలాంటిదేం జరగలేదు.