మోడీ సర్కార్ తెచ్చిన కార్పొరేట్ అనుకూల నూతన అటవీ సంరక్షణ నియమాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్ ఇందిరాపార్క్ లో ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన.. పోడు భూములకు సంబంధించి తిరస్కరించిన దరఖాస్తులన్నింటినీ పున:పరిశీలించి కేసీఆర్ వాగ్దానం ప్రకారం సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు.
నూతన అటవీ సంరక్షణ నియమాలు-2022 ఉపసంహరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ లేఖ రాయలని డిమాండ్ చేశారు కోదండరాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. తెలంగాణ జన సమితి పోడు రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులు వ్యాపారం కోసం భూమి అడుగడం లేదని.. 1100 ఎకరాల అటవీ భూమిని ఒక ఎంపీకి ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. అడవుల మీద అంత ప్రేమ ఉంటే పోలవరం ఆపాలని డిమాండ్ చేశారు కోదండరాం.
ఇక పౌర హక్కుల సంఘం నాయకులు, ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాల కోసం సుదీర్ఘకాలం ఆదివాసీలు ఉద్యమించడం బాధాకరమన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తొలిసారి పోరాడింది ఈ దేశంలో ఉన్న ఆదివాసీ దళితులే అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోడు భుములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా తన ప్రకటనను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు వక్తలు. మహబూబాబాద్, ఉట్నూరు ప్రాంతంలో టైగర్ జోన్ పేరిట ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించే దుర్మార్గమైన చర్యలను విరమించుకోవాలని అన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల నియమాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా కార్పొరేట్ శక్తులకు అడవిలో ఉన్న సహజ సంపదను దోచిపెట్టడానికి అవకాశం ఏర్పడుతోందని వివరించారు.