రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ జన సమితిని ప్రజలందరూ ఆదరించాలన్నారు ఆపార్టీ అధ్యక్షుడు కోదంరాం. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటించిని ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సూర్యపేట నుంచి టీజేఎస్ తరఫున కుంట్ల ధర్మార్జున్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని.. దించేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కోదండరాం. ఎంతసేపు ఎన్నికల్లో వెదజల్లిన డబ్బులను తిరిగి సంపాదించుకోవడమే టీఆర్‌ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసమర్థ పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు.
ప్రజలకు ఎంగిలి మెతుకులు వేసి.. అధికారంలోకి వచ్చి కోట్లు దండుకుంటున్నారని అన్నారు కోదండరాం. ప్రజల సంక్షేమం పట్టని రాజకీయాలను తిరస్కరించాలని సూచించారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన పాలకులు.. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు.
ఇక టీఆర్ఎస్ అసమర్ధ పాలనకు పెంచిన విద్యుత్ చార్జీలే నిదర్శనమని చురకలంటించారు కోదండరాం. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంవల్ల ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంలకు కట్టాల్సిన బకాయిలు ప్రభుత్వం కడితే నష్టాలు ఉండవని చెప్పారు. ప్రభుత్వ అవివేకం వల్లే డిస్కంలకు నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు.
మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్ధంపైనా స్పందించారు కోదండరాం. కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు.