గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ విభేధాలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ రియాక్ట్ అయ్యారు.
గురువారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ తో వ్యక్తిగత విభేదాలు ఉన్నా రాజ్యాంగ పరమైన బాధ్యతలను ప్రభుత్వం నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు.
గణతంత్ర వేడుకలపై హైకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప.. ప్రభుత్వానికి సోయి రాలేదని విమర్శించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలన్నారు.
రాజ్యాంగం భారతదేశ చరిత్రను తిరగరాసిందనే సంగతి ముఖ్యమంత్రి గ్రహించడం లేదన్నారు. రాజ్యాంగం సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను లేకుండా చేసిందన్నారు కోదండరామ్.