అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు బీభత్సం సృష్టించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రభుత్వ, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.
దేశవ్యాప్తంగా యువకులు రోడ్డెక్కడానికి కారణం కేంద్రం అనుసరిస్తున్న విధానాలేనని అన్నారు కోదండరాం. ఆర్మీ రిక్రూట్ మెంట్ విషయంలో కేంద్రం తన పద్దతులను మార్చుకుందని.. నాలుగేళ్ల కోసం అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకొచ్చారని వివరించారు. నాలుగేళ్ల తర్వాత సెలెక్ట్ అయిన వారిలో 25 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారని తెలిపారు.
ఈ పద్దతి కరెక్ట్ కాదని.. నాలుగేళ్ల తర్వాత ఏం చేయాలనే గందరగోళంలో యువకులు ఉన్నారని వివరించారు కోదండరాం. ఎంతోమంది యువతీ యువకులు ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారని.. పాత పద్దతుల్లో కొన్ని పరీక్షలు జరిగాయని చెప్పారు. కానీ.. వాటి రిజల్ట్స్ పెండింగ్ లో ఉండడంతో ఆగ్రహావేశాలు బయటపడుతున్నాయని చెప్పారు.
చుట్టుపక్కల దేశాలతో బార్డర్ లో ఒత్తిడి ఉన్న క్రమంలో ఈ పరిస్థితులు మంచిది కాదన్నారు కోదండరాం. ఆర్మీలో తాత్కాలిక పద్దతులు అనేవి కరెక్ట్ కాదని.. వెంటనే కేంద్రం అగ్నిపథ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.