తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత వేడి రగిల్చాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అసంతృప్తిగా మారవద్దన్న ఉద్దేశంతో టీఆర్ఎస్, ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు దూకుడుగా ప్రచారం చేశాయి. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల గెలుపోటములు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానున్నాయి.
అయితే, వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం మాత్రం తెలంగాణ ఉద్యమకారుల మధ్య పోటీగా మారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అగ్రగామిగా ఉన్న కోదండారం ఒకవైపు పోటీలో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కొలువుల కోసం, యువత కోసం ఆయన ప్రభుత్వంపై పోరాడారు కూడా. ఉద్యమ పార్టీగా… ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ మరోవైపు… దీంతో ఈ ఎన్నిక కోదండరాం వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారయ్యింది.
మాములుగా అయితే… గ్రాడ్యుయేట్ ఎన్నికను యువత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దాఖలాలు లేవు. చదువుకున్న వారి ఓట్ల పండుగ అయినా భారీ పోలింగ్ నమోదు కాదు. కానీ ఈసారి మాత్రం ఈ ఎన్నిక యువతలో మార్పుకోసం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. ఉద్యమంలో ముందుండి కొట్లాడిన యువత… ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే నాయకున్ని ఎన్నుకోనుంది. కానీ ఎవరి వైపు మొగ్గుచూపుతారు అన్నదే ఇక్కడ ఆసక్తికర పరిణామంగా ఉందని, యువత ఇప్పుడు వేసే ఓటు తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా మారనుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.