నర్సింహరెడ్డి, తొలివెలుగు ప్రతినిధి
కొడంగల్… కొంతకాలంగా ఈ పేరు పెద్దగా వినిపించకపోయినా, గత పదేండ్ల కాలంలో మార్మోగిన పేరు. కొడంగల్ గడ్డ రేవంత్ అడ్డా.. అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్లింది. కానీ అనూహ్యంగా 2018 ఎన్నికల తర్వాత తెరచాటైన కొడంగల్ పరిస్థితి ఇప్పుడేంటీ…? కేటీఆర్ దత్తత ఎంతవరకు వచ్చింది…? రేవంత్ లేని కొడంగల్ ఎలా ఉంది? తొలివెలుగు ప్రతినిధి ప్రత్యేక కథనం
రేవంత్ రెడ్డి అంటే కొడంగల్, కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి. రాజకీయంగా రేవంత్ రెడ్డి ఎదుగుదలకు కారణం కొడంగల్, కొడంగల్ అభివృద్ధికి గుర్తింపు కు కారణం రేవంత్ రెడ్డి. ఎక్కడో విసిరిపారేసినట్లు కర్ణాటక సరిహద్దుల్లో ఉండే కొడంగల్ నియోజవకర్గానికి అభివృద్ది రుచి చూపించిన నేత రేవంత్ రెడ్డి. అందుకే అక్కడ జనం, కార్యకర్తలు రేవంత్‌ను అభిమానించి, స్థానికుడు కాకపోయినా… గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. కొడంగల్ అడ్రస్ కూడా సరిగ్గా తెలియని సమయంలో టీడీపీ టికెట్‌తో పోటీ చేసి, గెలిచి… అసెంబ్లీలో కొడంగల్ స్థానానికే పరిమితం కాకుండా.. రాష్ట్ర సమస్యలపై పోరాటం చేశారు. అధికార పార్టీ నేతలతో పోటీపడి నియోజవకర్గానికి నిధులు తెచ్చారు.
కానీ, 2018 ఎన్నికల తర్వాత రేవంత్ లేని కొడంగల్‌ను ఓసారి చూస్తే… కొడంగల్ మళ్లీ అభివృద్ది కోసం అలమటిస్తున్నట్లు కనపడుతోంది. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అంటూ వచ్చిన నాటి మంత్రి తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి నియోజకవర్గానికి చుట్టం చూపైపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రేవంత్ ను టార్గెట్ చేయడం, ఎన్నికల కు రెండు రోజుల ముందు రేవంత్ రెడ్డి తో పాటు తన అనుచరులను అరెస్ట్ చేయడంకు తోడుగా తాను చేసిన కొన్ని తప్పిదాల వల్ల రేవంత్ ఓడిపోయారు. రాష్ట్ర స్తాయినేతగా ఎదిగిన తరువాత రేవంత్ నియోజకవర్గానికి దూరం అయ్యారు అదే రేవంత్ ఓటమికి కారణం. కానీ ఆ ఓటమే ఇప్పుడు కొడంగల్ అభివృద్ది ఆగిపోవటానికి కారణం అయింది.
రేవంత్ రెడ్డి ఓడిపోవడం వల్ల రాజకీయంగా చాలా నష్టపోయారు, అలాగే రేవంత్ ను ఓడించడం వల్ల కొడంగల్ నష్టపోయింది అన్న చర్చ స్థానికంగా స్పష్టంగా కనపడుతోంది. మళ్ళీ కొడంగల్ కథ మొదటికొచ్చిందని స్వయంగా కొడంగల్ గులాబీ కార్యకర్తలే కామెంట్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. కేటీఆర్ దత్తత తీసుకుంటున్న అని ఎన్నికల ముందు ప్రకటించారు. దత్తత మాట దేవుడెరుగు కనీస అభివృద్ధి కూడా కొడంగల్ లో జరగడం లేదు. మద్దూరు, బోమరస్ పెట్, దౌల్తాబాద్ లలో రేవంత్ హయం లో ప్రారంభం అయిన కాలేజీ నిర్మాణాలు అలాగే మిగిలిపోయాయి. 2018 ఎన్నికల తరువాత వాటికి ఒక్క ఇటుక కూడా యాడ్ అవ్వలేదు. ఇక కోస్గి బస్ డిపోకు 5 మంది మంత్రులు హరీష్ ఆధ్వర్యంలో దండయాత్రగా వచ్చి 15 నెలల క్రితం రెండవ సారి శంకుస్థాపన చేసి వెళ్లారన్న పేరుంది. కానీ ఈరోజు దాకా బస్ డిపో దగ్గర తట్టెడు మట్టికూడా తీయలేదు అని స్థానిక ప్రజలు అంటున్నారు. కోస్గి హాస్పిటల్ పందులకు నిలయంగా మారింది. వీటితో పాటు కమీషన్ల రాజ్యం మళ్ళీ వచ్చింది అంటున్నారు స్థానికులు. షాపు పెట్టుకోవడానికి ఇంత, రోడ్డు వేయడానికి ఇంత, కల్లు డిపోకు ఇంత, చివరికి కల్యాణ లక్ష్మీ చెక్ లు తీసుకోవడానికి ఇంత అంటూ వసూళ్లు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు స్థానిక కాంగ్రెస్ లీడర్స్. ఇక కొడంగల్ పేరు ఎక్కడ వినిపించడం లేదు, కొడంగల్ కు ఉన్న గుర్తింపు కూడా పోతుంది అని బాధపడుతున్నారు.
రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగేది, ఏ బిజినెస్ అయిన ప్రశాంతంగా చేసుకునే వాళ్ళం, కమిషన్ మాట వినిపించేది కాదు అంటున్నారు కొడంగల్ నియోజకవర్గ ఓటర్లు.