విజయవాడ : మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయనే హాట్ టాపిక్. ఆయన పురుగులు మందు తాగారని కొందరు.. అరెస్టు కాబోతున్నారని మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం తీవ్రమైన ఛాతినొప్పితో తన ఆసుపత్రిలో చేరి అల్లుడి పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కంప్యూటర్ సామాగ్రి మాయమైన కేసులో ఆ రోజు ఉదయమే అసెంబ్లీకి చెందిన అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే కేసులో మాజీ స్పీకర్‌పై గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు వ్యవహారంపై అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారని వార్త. కోడెల కుమారుడు శివరామకృష్ణపై కూడా ఫిర్యాదు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక సమాచారం చక్కెర్లు కొడుతోంది. దీనిపై పోలీస్ శాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు.
మరోపక్క.. తన కుమారుడితో కోడెలకు ఆరోజు తీవ్రమైన వాగ్యుద్ధం జరిగిందని, ఆ గొడవ బూతులు తిట్టే స్థాయికి వెళ్లడంతో మనస్థాపం చెందిన కోడెల పురుగుల మందు తాగి ఆస్పత్రి పాలయ్యారని వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ సర్కులేట్ అవుతోంది. ఆయనకు వచ్చింది సన్‌స్ట్రోక్ కాదని… ‘సన్’ స్ట్రోక్ అని ఈ మెసేజ్ సారాంశం. ఇలావుంటే, టీడీపీ అభిమానులు కొందరు ఫేస్‌బుక్ వేదికగా కోడెల శివప్రసాదరావును పల్నాటి పులిగా కీర్తిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు. కక్షలు కార్పణ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా వుండే పల్నాడు ప్రాంతంలో అన్యాయాల్ని ఎదిరించిన పులిబిడ్డగా కోడెలను అభివర్ణిస్తూ ఈ పోస్టింగ్స్ వున్నాయ్. 1980 దశకంలో కాంగ్రెస్ వాళ్ల దుర్మార్గాలకు ఎదురొడ్డి ప్రత్యర్థుల ఇళ్ల మధ్య నుంచి దూసుకెళ్లి బాధితుల్ని ఆదుకున్న తెగువ గల నేతగా కోడెల గురించి గుర్తుచేస్తున్నారు.
కోడెల కుటుంబం ఇటీవలి ఎన్నికల్లో అంతగా అభాసుపాలవ్వడానికి స్వయంగా ఆయన కుమారుడే కారణమని కొందరు అంటుంటారు. ఐతే, కోడెల మెడలు వంచిన వైరిగా వైసీపీ ఫైర్‌బ్రాండ్ అంబటి రాంబాబు గురించి ఇక్కడ తప్పకుండా ప్రస్తావించాలి. టీడీపీలో సీనియర్ డేరింగ్ లీడర్‌గా ఉన్న కోడెలను, ఆయన కుటుంబాన్ని గట్టిగా ఎదుర్కొని.. అడుగడుగునా వారికి చుక్కలు చూపించిన నాయకుడిగా అంబటి రాంబాబు పేరు పొందారు. ఏపీ విభజన తర్వాత తొలి ఎన్నికల్లో వీరిద్దరూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో కోడెల విజయం సాధించి స్పీకర్ అయ్యారు. ఇక మొన్నటి ఎన్నికల్లో రగిలిన ఉద్రిక్తతలతో వీరి మధ్య రాజకీయ కుంపటి బాగా రాజుకుంది. ఆ ఎన్నికల్లో కోడెలపై విజయం సాధించిన అంబటి అంతటితో ఆగలేదు. ఆ కుంపటిని రగిలిస్తూనే ఉన్నారు. కోడెల అధికారంలో ఉండగా సత్తెనపల్లిలో ఆ ఫ్యామిలీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందంటూ దుమ్మెత్తిపోయడం ఆరంభించారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇరుకున పెట్టారు. తాజాగా కోడెల ఫ్యామిలీని రచ్చకీడ్చే వ్యూహం సిద్ధం చేశారు. ఈ నేపధ్యంలో కోడెల ఫామిలీపై వచ్చిన అభియోగాలు, ఫిర్యాదులు, కేసులు వచ్చేశాయి. కోడెల కుమారుడి షోరూంపై విజిలెన్స్ దాడి, వాహనాల పన్ను ఎగవేత వ్యవహారం రాజకీయ కుంపటిని బాగా రగిలించింది. హైదరాబాద్ అసెంబ్లీ ఫర్నిచర్ కోడెల ఇంట్లో, తనయుడి షోరూంలో ఉందని, దీన్ని దొంగతనంగా తీసుకొచ్చారని అంబటి అభియోగం. అసెంబ్లీ కార్యదర్శికి తీసుకెళ్లమని చెప్పినా తీసుకెళ్లలేదని కోడెల వాదం. ఇలాంటి వత్తిళ్ల మధ్య కోడెల ఛాతినొప్పితో ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా అరెస్ట్ అవుతారా.. తనపై వచ్చిన అభియోగాల నుంచి రక్షణ పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తారా..చూడాలి!