కోడెల పర్సనల్ మొబైల్ ఫోన్ మిస్సయ్యిందా..? ఉరి వేసుకోవడానికి ముందు ఆయన ఎవరితో మాట్లాడారు? దాదాపు అరగంట సేపు ఏకాంతంగా ఏంమాట్లాడి వుంటారు? ఆ సంభాషణ తరువాతే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని వుంటారా? అంతసేపు మాట్లాడారంటే ఎవరితో మాట్టాడివుంటారు? పోలీస్ దర్యాప్తులో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి.
హైదరాబాద్: మాజీ సభాపతి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు పర్సనల్ మొబైల్ ఫోన్ మిస్సయినట్టు సమాచారం. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోడెల సెల్ ఫోన్ మిస్సయ్యిందని గుర్తించారు. కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఎవరితోనో ఫోన్ కాల్‌లో మాాట్లాడినట్టు దర్యాప్తులో తెలిసింది. సోమవారం సాయంత్రం 5గంటల తర్వాత ఫోన్ స్విచాఫ్ అయినట్లు సమాచారం. కోడెల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
సోమవారం ఉదయం ఎప్పటిలాగే దినచర్య ప్రారంభించిన కోడెల.. ఉదయం 8.30 గంటల సమయంలో ఒకరితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 24 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్ రికార్డులో కనుగొన్నారు. ఫోన్‌లో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? ఆయనతో ఏం మాట్లాడారనేది తదుపరి దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. కోడెల ఫోన్ ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ వివరాలు సేకరిస్తున్నామని, ఎస్‌ఎంఎస్‌ల్నీ పరిశీలిస్తున్నామని తెలిపారు.