టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జూలు విదిల్చాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టులో 28వ సెంచరీ నమోదు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో (చివరి) టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480 పరుగులు చేసింది.
టీమిండియా నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝుళిపించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తిచేశాడు. టెస్టుల్లో విరాట్ ఏకంగా 1204 రోజుల తర్వాత సెంచరీ చేశాడు. 2019 వరకూ టాప్ ఫామ్ లో ఉన్న అతడు.. 2020, 2021లలో ఏ ఫార్మాట్ లోనూ సెంచరీ చేయలేకపోయాడు. 2022లో వన్డేలు, టీ20ల్లో కలిపి నాలుగు సెంచరీలు చేసినా.. టెస్టుల్లో ఆ ముచ్చట తీర్చుకోలేకపోయాడు. 2019, నవంబర్ తర్వాత మళ్లీ ఇప్పుడే అంటే 1204 రోజుల తర్వాత ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో టెస్టు శతకం సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇది అతనికి 75వ సెంచరీ.
ఇండియా, ఆస్ట్రేలియా చివరి టెస్టులో కోహ్లీ విజృంభించాడు. ఫలితంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టుల్లో 28వ సెంచరీ చేశాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. 28వ సెంచరీ చేయడానికి 1204 రోజులు సమయం పట్టింది. పలుసార్లు సెంచరీకి చేరువగా వచ్చిన కోహ్లీ ఔట్ కావటంతో అభిమానులను నిరాశపర్చాడు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ 28వ సెంచరీని పూర్తి చేశాడు. 241 బాల్స్ ఎదుర్కొన్న కోహ్లీ 100 పరుగులు చేశాడు. ఇందులో ఐదు బౌండరీలు మాత్రమే ఉన్నాయి.
స్వదేశంలో కోహ్లీకి ఇది 14వ టెస్ట్ సెంచరీ. భారతదేశం తరపున స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో అజారుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్ సర్కార్ లను కోహ్లీ అధిగమించాడు. సుదీర్ఘ కాలం అనంతరం టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ బ్యాట్ ఎత్తి అభిమానులకు అభివాదం చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియాపై పదేళ్ల తర్వాత విరాట్ కోహ్లి టెస్ట్ సెంచరీ చేయడం విశేషం. చివరిసారి 2013, ఫిబ్రవరిలో చెన్నై టెస్టులో కోహ్లి ఆస్ట్రేలియాపై మూడంకెల స్కోరు చేశాడు. ఆ మ్యాచ్ లో 107 రన్స్ చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు అహ్మదాబాద్ లో సెంచరీ అందుకోగలిగాడు. ఇక ఓవరాల్ గా కూడా 2018, డిసెంబర్ తర్వాత ఆస్ట్రేలియాపై అతడు చేసిన తొలి సెంచరీ ఇదే. 2018-19లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లినప్పుడు ఆ టీమ్ పై చివరిసారి విరాట్ శతకం చేశాడు. ఆ సిరీస్ రెండో టెస్టులో విరాట్ 123 రన్స్ చేశాడు.