ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు అభిమానులకు ధోని షాకిచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ స్పందించాడు.
“చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమ సారథ్య బాధ్యతలు నిర్వర్తించావు. ఎల్లో జెర్సీలో దిగ్గజ కెప్టెన్ గా కొనసాగావు. నీ చరిత్రను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. నువ్వంటే నాకెప్పుడూ అమితమైన గౌరవమే” అని ధోనీని హత్తుకునే ఓ ఫొటోకు ట్యాగ్ చేస్తూ.. కోహ్లీ భావోద్వేగ పోస్టు చేశాడు.
ఈ సందర్భంగా ధోనీని ప్రత్యేకంగా అభినందించాడు కోహ్లీ. ధోనీ సారథ్యంలోనే తాను టీమ్‌ఇండియాలోకి వచ్చానిని గుర్తుచేసుకున్నాడు. ఆటలో తాను రాణించడానికి మహీ సలహాలు నాకు కీలకం అని పేర్కొన్నాడు. మహీ నుంచే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ చేపట్టానని తెలిపాడు.
కాగా.. ఈ ఏడాది విరాట్ సైతం రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఆర్సీబీ యాజమాన్యం ఫాఫ్ డుప్లెసిస్ ను కెప్టెన్ గా నియమించింది. దీంతో 2013 తర్వాత ధోనీ, కోహ్లీ తొలిసారి ఐపీఎల్ లో కెప్టెన్లుగా కాకుండా ఆటగాళ్లుగా ఆడనున్నారు.