టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. అలవోకగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసే కోహ్లీ బ్యాట్ మూగబోయింది. ఇటీవలో కాలంలో సింగల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరుతూ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఏకైక టెస్టులో నిరాశపరిచిన కోహ్లీ.. టీ20, వన్డే సిరీస్‌లోను రాణించలేకపోతున్నాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. విరాట్ కోహ్లీ ఫామ్‌పై కొంత మంది విమర్శిస్తుంటే.. మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శరణ్ డీప్ సింగ్, అజయ్ జడేజా లాంటి వారు కోహ్లీకి అండగా నిలవగా.. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా తన ఆరాధ్య క్రికెటర్‌కు మద్దతు ఇచ్చాడు.
లార్డ్స్ వన్డేలో 16 పరుగులకే ఔటయ్యాక.. బాబర్ ఓ ట్వీట్ చేశాడు. ‘త్వరలోనే ఇలాంటివి సమసిపోతాయి. ధైర్యంగా ఉండు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్వీట్ చేసిన బాబర్‌ను పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసించాడు. బాబర్ ట్వీట్‌పై విరాట్ స్పందించాలని కోరాడు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన ట్వీట్‌పై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘థ్యాంక్యూ బాబర్ ఆజమ్. నువ్వు ఇలాగే రాణించి మరింత ఎత్తుకు ఎదగాలి. ఆల్ ది బెస్ట్’ అంటూ పేర్కొన్నాడు.
ఈ ట్వీట్ కూడా క్షణాల్లో వైరల్ అయింది. అందరూ బాబర్, కోహ్లీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో కోహ్లీని గురువు అని, రోల్ మోడల్ అని బాబార్ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ బ్యాటింగ్ చూస్తూనే తాను ఎదిగానంటూ పాక్ కెప్టెన్ పలు సందర్భాల్లో తెలిపాడు. బాబర్ ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్న విషయం తెలిసిందే.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022