క్రీజ్ లో ఒక్కసారి నిలదొక్కుకుంటే.. విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి పరుగుల వరద పారాల్సిందే. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో అదే జరిగింది. పరుగులతో పాటు రికార్డుల వేట కూడా కొనసాగించాడు కోహ్లి. 110 బంతుల్లో 166 రన్స్ తో నాటౌట్ నిలిచి దుమ్మురేపాడు. ఇటు గిల్ కూడా 116 పరుగులతో సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
కోహ్లి హాఫ్ సెంచరీ వరకు నిదానంగా ఆడి తర్వాత గేర్ మార్చాడు. లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. సిక్సర్ల మోత మోగించాడు. మునపటి కోహ్లీని గుర్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు కోహ్లి. గత మ్యాచ్ లో కూడా సెంచరీ బాదాడు ఈ రన్ మెషిన్. తాజా సెంచరీతో సచిన్ రికార్డ్ బద్ధలైంది.
స్వదేశంలో అత్యధికంగా 21 సెంచరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లి. సచిన్ 20 సెంచరీలతో రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లా 10 సెంచరీలతో మూడో ప్లేస్ లో ఉన్నారు. అంతేకాదు వన్డేల్లో శ్రీలంక మాజీ క్రికటెర్ మహేళ జయవర్దనే రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు.
వన్డేలు, టెస్టులు, టీ-20ల ద్వారా కోహ్లి ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 74 సెంచరీలు చేశాడు. ఇందులో వన్డేల్లో 46, టెస్టుల్లో 27, టీ-20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్ 100 సెంచరీల తర్వాత, 74 సెంచరీలతో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు.