‘ఆపిల్ షాట్ ఆన్ ఐ ఫోన్ మాక్రో ఫోటోగ్రఫీ’ ఛాలెంజ్ లో మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్తాచాటాడు. ఆపిల్ ప్రకటించిన 10 మంది విజేతల జాబితాలో కొల్హపూర్ కు చెందిన ప్రజ్వల్ చౌగులే చోటుదక్కించుకున్నారు. ఈ ఛాలెంజ్ కు ఎంట్రీలను ఈ ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 16 వరకు కంపెనీ స్వీకరించింది.
చౌగులేతో పాటు చైనా, హంగేరీ, ఇటలీ, స్పెయిన్, థాయ్‌లాండ్, యూఎస్‌తో సహా ఇతర దేశాల నుండి వచ్చిన మరో తొమ్మిది మంది విజేతలు ఈ జాబితాలో ఉన్నారు. చౌగులే తీసిన ఫోటోను ఆపిల్ అధికారిక వెబ్ సైట్, ఆపిల్ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కంపెనీ ప్రతినిధులు అప్ లోడ్ చేయనున్నారు.
దీంతో పాటు ఎంపిక చేసిన నగరాల్లో ఆయన తీసిన ఫోటోను బిల్ బోర్డ్స్ పై పెట్టనున్నారు. ఈ ఫోటోలను విజేతల దేశాల్లో కూడా ప్రదర్శించనున్నారు. ఐ ఫోన్ 13 మాక్రో కెమెరా సెన్సార్ ను హైలేట్ చేసే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ ను నిర్వహించారు. దీనిలో భాగంగా ఫోటోగ్రాఫర్లు ఐ ఫోన్ 13 లేదా ఐ ఫోన్ 13 ప్రో మాక్రో లెన్స్ ఉపయోగించి ఫోటోలు తీయాలని నిబంధనలను కంపెనీ పెట్టింది.
దీనికోసం సాలెపురుగు గూడుపై పడిన మంచు బిందువులను ఆపిల్ మాక్రో లెన్స్ ఉపయోగించి ఫోటోలు తీశాడు. అవి ముత్యాల్లాగా మెరస్తూ కనిపించాయి. దీనిపై చౌగులే మాట్లాడుతూ… తాను ఒక ప్రకృతి ప్రేమికున్ని అని తెలిపారు. తెల్లవారు జామునే ఐఫోన్ 13 ప్రో తీసుకుని వాకింగ్ కు వెళ్లడం తనకు ఇష్టం అని చెప్పారు.
అలా ఒక రోజు వెళుతుండగా సాలెపురుగు గూడుపై మంచు పడటం తన దృష్టిని ఆకర్షించిందన్నారు. సాలెపురుగు ఒక హారాన్ని తయారు చేసుకుంటున్నట్టుగా గూడును అల్లడం తనను ఆకర్షించిందన్నారు. అదే సమయంలో దానిపై మంచు బిందువులు పడి ముత్యాల్లా మెరవడం తాను ఆశ్చర్యపోయానన్నారు. వెంటనే దాన్ని తన ఐఫోన్ 13 ప్రోలో బంధించినట్టు పేర్కొన్నారు.