ఉత్తర కోల్ కతా లోని డమ్ డమ్ సెంట్రల్ జైలు లో కరనా వైరస్ ఖైదీల మధ్య చిచ్చు పెట్టింది. ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఆ రెండు గ్రూపుల మధ్యలోకి జైలు సిబ్బంది కూడా ఎంటరయ్యారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు జైలు లోపల టియర్ గ్యాస్ ను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు.పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు జైలు ఆవరణలో గస్తీ తిరుగుతున్నారు. పోలీసులు గేటు లోపలికి ప్రవేశించగానే ఖైదీలు వారిపై దాడి చేశారు.
వివరాల్లోకి వెళ్తే…జైలులో కొంత మందికి కరోనా వైరస్ సోకిందని..వారితో తమను కూడా కలిపి ఉంచడం వల్ల వైరస్ సోకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోన్న కొందరు ఖైదీలు తమకు బెయిల్ ఇస్తే ఇళ్లకు వెళతామని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నుంచి జైలు అధికారులు కరోనా వైరస్ భయంతో ఖైదీలకు ములాఖత్ లను రద్దు చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే కిటికీని మార్చి 31 వరకు మూసివేశారు. ఇది ఖైదీల ఆగ్రహానికి కారణమైంది. అదే కాకుండా 10 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు అధికారులు 15 రోజుల పెరోలు (ఇంటికి వెళ్లి రావడానికి అనుమతి) మంజూరు చేశారు. దీంతో ఆగ్రహించిన మరికొంత మంది ఖైదీలు జైలులోని కొన్ని గదులను తగులబెట్టడం మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జైలు సిబ్బందిపై ఖైదీలందరు కలిసి దాడి చేశారు. పోలీసులు వస్తే వారిపై కూడా దాడికి దిగారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర మంత్రి ఉజ్వల్ బిశ్వాస్, జైలు ఉన్నతాధికారులు డమ్ డమ్ సెంట్రల్ జైలు దగ్గరకు చేరుకొని ఘర్షణలకు కారణాలు కనుక్కొంటున్నారు.