బెంగాలీలపై ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను చిక్కుల్లో పడేశాయి. గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఆయన.. బెంగాలీలను అవమానపరిచే విధంగా మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల ధరలు ఎక్కువగా ఉన్నా.. త్వరలోనే తగ్గుతాయని, యువకులకు ఉద్యోగాలు కూడా వస్తాయని, కానీ ఢిల్లీలో మాదిరి మీ చుట్టుపక్కల రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు నివసిస్తుంటే గ్యాస్ సిలిండర్లతో మీరేం చేస్తారని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
బెంగాలీల కోసం చేపలు వండుతారా అని హేళనగా ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును పురస్కరించుకుని కోల్ కతా పోలీసులు.. పరేష్ రావల్ పై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.
పరేష్ రావల్ వంటి నటులు ఇలా మాట్లాడడం తగదని తృణమూల్ కాంగ్రెస్ ఐటీ హెడ్ దేబాంషు భట్టాచార్జీ అన్నారు. గ్యాస్, ఎల్ఫీజీ వంటి వాటి ధరలు పెరిగినందువల్లే మోడీ అధికారంలోకి వచ్చారని, ఈ విషయాన్ని రావల్ విస్మరించరాదని అన్నారు.
‘ఓ మై గాడ్’ లాంటి సినిమాలో నటించిన ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రావల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఎవరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని, గుజరాతీలు కూడా చేపలు వండి తింటారని, ఇక్కడ అవి ముఖ్యం కాదని, అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను ఉద్దేశించినవని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా .. తన కామెంట్స్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలన్నారు.