– ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
– ఇద్దరిదీ ఒకటే పార్టీ.. కానీ దారులు వేరు
– కేటీఆర్ కలిసినా కుదరని సయోధ్య
– సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కిన రాజకీయం
– పోలీసుల పహారాలో కొల్లాపూర్
– బీరం అరెస్ట్.. అంతా డ్రామా అంటున్న జూపల్లి
– ఇది ఇతర నియోజకవర్గాలకు పాకుతుందా?
– ఈ కొట్లాటలకు కేసీఆరే కారణమా?
సాధారణంగా ఒకే పార్టీలోని ఇద్దరు నేతలు తిట్టుకుంటున్నా.. కొట్టుకుంటున్నా అధిష్టానం చల్లబరచడం కామన్. కానీ.. కొల్లాపూర్ రాజకీయం గురించి.. జరుగుతున్న డ్యామేజ్ గురించి టీఆర్ఎస్ పెద్దలు పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనేలా యుద్ధం జరుగుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు. కొట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
2014 నుంచి జూపల్లి వర్సెస్ బీరం మొదలైంది. అప్పటి ఎన్నికల్లో జూపల్లి టీఆర్ఎస్ తరఫున, బీరం కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు. అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఊపులో ఉన్న కృష్ణారావు ఐదోసారి కూడా గెలిచి సత్తా చాటారు. ఆ ఎన్నికల్లో జూపల్లికి 72,741 ఓట్లు, హర్షవర్ధన్ కు 62,243 ఓట్లు వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ వీరిద్దరూ తలపడ్డారు. కానీ.. ఈసారి సీన్ రివర్స్ అయింది. హర్షవర్ధన్ విజయం సాధించారు. ఆయనకు 80,611 ఓట్లు, జూపల్లికి 68,068 ఓట్లు వచ్చాయి. అయితే.. తర్వాత కొన్నాళ్లకు బీరం కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరారు. దీంతో అప్పటిదాకా పార్టీల ద్వారా ప్రత్యర్థులుగా ఉన్న వీరు.. తర్వాత ఒకే పార్టీలో ఉంటూ విరోధులుగా వ్యవహరిస్తూ వచ్చారు. కొన్నాళ్లు కోల్డ్ వార్ నడవగా.. ఈమధ్య కాలంలో డైలాగ్ వార్ బహిరంగంగానే జరుగుతోంది.
ఇటీవల ఇద్దరు నేతలు బహిరంగంగా వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. కొల్లాపూర్ అభివృద్ధిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. బహిరంగ చర్చకు సిద్ధమంటూ అటు జూపల్లి, ఇటు బీరం తొడలు కొట్టుకున్నారు. కొల్లాపూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలంటూ జూపల్లి సవాల్ చేయగా.. మీ ఇంటికే వస్తానంటూ బీరం కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు వర్గాలు చర్చకు అనుమతివ్వాలని పోలీసులకు దరఖాస్తులు చేసుకోగా.. తిరస్కారం లభించింది. పోలీసులు వద్దన్నా అటు జూపల్లి, ఇటు బీరం చర్చకు పట్టుబట్టారు. దీంతో ఇరు వర్గాలవారు రోడ్లపైకి వచ్చారు. కొల్లాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్షవర్ధన్ తన అనుచరులతో జూపల్లి ఇంటికి వెళ్లేందుకు చూశారు. అయితే.. పోలీసులు అడ్డుకుని ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన జూపల్లి ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ‘‘రిజర్వాయర్ ముంపు బాధితులకు సరైన పరిహారం అందలేదు. ముంపు బాధితులకు పునరావాసం దక్కలేదు. ముంపు బాధితులది వర్షం పడితే ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. సమస్య పరిష్కరించకుండా ఎమ్మెల్యే నాపై నిందారోపణలు చేశారు. నేను సంపాదించిన పేరు, ప్రతిష్ఠలను మసకబార్చే ప్రయత్నం చేశారు. మంచి చేసి పేరు సంపాదించాలి.. చౌకబారు రాజకీయాలెందుకు?. ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశా. అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు రమ్మని 15 రోజులు సమయమిచ్చా. మా ఇంటికే వస్తా అన్నారు. నా వద్దకు వచ్చేందుకు ధైర్యం చాలక అరెస్టు చేయించుకున్నారు. తన వర్గీయులకు మాత్రమే ఎమ్మెల్యే హర్షవర్ధన్ మేలు చేశారు’’ అంటూ ఫైరయ్యారు జూపల్లి.
కొల్లాపూర్ పంచాయితీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేసీఆర్ చేజేతులా చేసుకున్నదేనని అంటున్నారు విశ్లేషకులు. ఆనాడు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఆలోచనతో ఇతర పార్టీల్లోని నేతల్ని కారులోకి ఎక్కించేశారు కేసీఆర్. ఇప్పుడది ఓవర్ లోడ్ అయింది. ముందుకెళ్లాలంటే గేర్లు వేయలేని పరిస్థితి. స్టీరింగ్ సరిగ్గా తిరగని దుస్థితి అని వివరిస్తున్నారు విశ్లేషకులు. ఇది ఒక్క కొల్లాపూర్ లోనే కాదు చాలా నియోజకవర్గాల్లో ఉందని.. రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకా చూడాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. మొన్నామధ్య మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ పర్యటనకు వెళ్లారు. స్వయంగా జూపల్లి ఇంటికి వెళ్లి మాట్లాడారు. దీన్నిబట్టి టీఆర్ఎస్ లో ముందు ప్రయారిటీ జూపల్లికే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పైగా పీకే ఇచ్చిన 40 మంది బ్యాడ్ ఎమ్మెల్యేల లిస్టులో బీరం కూడా ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంలో అధిష్టానం పెద్దగా వేలు పెట్టడం లేదని అంటున్నారు. అయితే.. దీన్ని ఇలాగే వదిలేస్తే.. రానున్న రోజుల్లో ఇది ఇతర నియోజకవర్గాలకు పాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.